ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) లేదా బోన్ లాస్ వల్ల ఎముకలు విరగటం ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ వారి డేటా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఆస్టియోపోరోసిస్ దాదాపు 200 మిలియన్ జనాభా పై ప్రభావం చూపుతుంది.[1]
ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) ఒక మెటబాలిక్ (జీవక్రియ) వ్యాధి. ఎముకలు బలహీనపడి పెలుసుబారడం ఈ వ్యాధి లక్షణం. సాధారణంగా చిన్నపాటి ప్రమాదాలకు గురైనపుడు ఎముకలు విరగడం (ఫ్రాక్చర్) జరుగుతుంది, అంతవరకూ అసలు తనకు ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తించలేరు. ఆస్టియోపోరోసిస్ శరీరంలోని ఏ ఎముకపై అయినా ప్రభావం చూపించవచ్చు, కానీ సర్వ సాధారణంగా తొంటి (హిప్) ఎముక, వెన్ను ఎముక, మరియు మణికట్టు ఎముకలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకలు విరగవచ్చు, కొన్నిసార్లు ఆపరేషన్ అవసరం కావచ్చు, వైకల్యం కలగవచ్చు, అరుదుగా మరణం కూడా సంభవించవచ్చు.
ఎముకలు ప్రధానంగా కాల్షియం, ఫాస్పరస్ మరియు ఇతర సెల్యూలర్ భాగాలు వంటి ఖనిజాలతో ఏర్పడతాయి. మనవ శరీరంలో ఎముక అత్యధిక రక్తనాళాలు కలిగిన కణజాలం. రక్తం తరువాత అత్యధిక పునరుత్పత్తి శక్తి కలిగినది. వయసు పైబడే కొలది, దీని పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అయితే, ఆస్టియోపొరోసిస్ ఉన్న వ్యక్తి విషయంలో ఎముక నష్టం యొక్క నికర రేటు తన వయసులో ఉండవలసిన సాధారణ మోతాదుకన్నా ఎక్కువగా ఉంటుంది.
ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) వ్యాధి కారణాలు?
బాల్యంలో ఎముక పెరుగుదల, మరియు మరమ్మత్తు ప్రక్రియకు పట్టే సమయం తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొలది ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది. ఎముకలు పొడవు పెరగడం ఒక వ్యక్తీ యొక్క 16 లేదా 18 సంవత్సరాల వయసు మధ్య కాలంలో ఆగిపోతుంది. కాని 20 సంవత్సరాల వయసు వరకు ఎముకల సాంధ్రత పెరగడం జరుగుతుంది.
వయస్సు పెరిగే కొలది, పురుషులు మరియు మహిళల లో 35 సంవత్సరాల వయస్సు తరువాత సంవత్సరానికి 0.5% నుండి 0.3% వరకు వారి ఎముకల సాంద్రత కోల్పోవడం జరుగుతుంది. కొంతమంది మహిళలు, వారి మెనోపాజ్ (ముట్లుడగటం) తర్వాత సంవత్సరాలలో శీఘ్రంగా ఎముకల సాంద్రతను కోల్పోతారు. ఈ (ముట్లుడిగిన) మహిళల్లో, ఆస్టియోపోరోసిస్ సంభవించడానికి, వీరిలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ స్థాయి ఆకస్మిక తగ్గుదల ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. కాల్షియం మరియు విటమిన్ D ల లోపం కూడా, ఎముకలు బలహీనపడడానికి ఒక కారణం కావచ్చు.
Osteoporosis – ఆస్టియోపోరోసిస్ రావడానికి మరి కొన్ని కారణాలు:
- వంశపారంపర్యంగా, ముఖ్యంగా తల్లితండ్రులలో హిప్ (తొంటి) ఫ్రాక్చర్ ఉన్న సందర్భాలలో.
- మన శరీరంలో హార్మోన్స్ ను స్రవించే గ్రందులపై ప్రభావం చూపే పరిస్థితి, అంటే ఉత్తేజిత (ఓవర్ యాక్టివ్) థైరాయిడ్ గ్రంధి (హైపర్ థైరాయిడిజం) లేదా ఉత్తేజిత (ఓవర్ యాక్టివ్) పారాథైరాయిడ్ గ్రంధి (హైపర్ పారాథైరాయిడిజం) ఉన్నపుడు.
- రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేదా సిఓపిడి (COPD – క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్).
- ప్రెడ్నిసోలోన్ (prednisolone) వంటి ఎముకలపై ప్రభావం చూపే మందుల దీర్ఘకాలిక వాడకం.
- మాలబ్జర్పషన్ సమస్యలు – జీర్ణమైన ఆహారం నుండి పోషకాలను, చిన్నప్రేగు సరిగా గ్రహించలేకపోవడం.
- అధిక మధ్యపానం మరియు ధూమపానం.
Osteoporosis – ఆస్టియోపోరోసిస్ వ్యాధి నిర్ధారణ ఎలా చేయబడుతుంది?
అవహగాహనా లోపం వల్ల అనవచ్చు, వ్యాధి లక్షణాలు బయటకు కనిపించేవి కాకపోవడం కావచ్చు, ఆస్టియోపోరోసిస్ ను ప్రారంభ దాశలో గుర్తించడం చాలావరకు జరగదు. ఈలోపు ఎముకలకు జారగాల్సిన నష్టం జరిగిపోవడం, చిన్నపాటి ప్రమాదాలకే ఎముకలు విరిగే పరిస్థితి తలెత్తుతుంది. నడివయసు వారికి ఎముకలు విరిగి వైద్యుడిని సందర్శించే చాలా సందర్భాలలో, అసలు కారణం తెలియడానికి, ఆర్తోపెడిక్ వైద్యుడు ఎముకల ఆరోగ్య స్థితిని అంచనా వేయడానికి కొన్ని డయాగ్నొస్టిక్ పరీక్షలు (అబ్సార్ప్టియోమెట్రీ డ్యుయల్ ఎనర్జీ స్కాన్ – DEXA/DXA) సూచిస్తాడు. ఇవి ఎముక ఖనిజ సాంద్రత (BMD) ను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
Osteoporosis – ఆస్టియోపోరోసిస్ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది?
గణాంకాల ప్రకారం, భారతదేశం లో సుమారు 26 మిలియన్ల మంది 2003 లో ఆస్టియోపోరోసిస్ వ్యాధికి లోనయ్యారు. 2013 సంవత్సరంలోపు, సుమారు 36 మిలియన్ జనాభా ప్రభావితం అవుతుందని అంచనా.
సాధారనంగా ఆస్టియోపోరోసిస్ పురుషులకంటే స్త్రీలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. భారతదేశం లో తక్కువ ఆదాయం పొందే మహిళల్లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, దాదాపు 29% మహిళలు పోషక ఆహార లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ బారిన పడ్డట్టు రుజువైంది.
అది కూడా ప్రపంచవ్యాప్తంగా 50 పైబడి ప్రతి మగ్గురు మహిళల్లో ఒకరికి ఆస్టియోపోరోసిస్ ఫలితంగా ఎముకల పగుళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని కలిగి ఉన్నారని అంచనా.[2]
Osteoporosis నయం చేయడం ఎలా?
ఈ చికిత్స పద్దతుల ముఖ్య లక్ష్యం ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకలు పెలుసుబారే వేగాన్ని తగ్గించండి.
- ఆహారంలో మార్పు మరియు వ్యాయామాల వంటి జీవనశైలిలో మార్పుల ద్వారా.
- కాల్షియం మరియు విటమిన్ D వాడడం ద్వారా.
- ఆస్టియోపోరోసిస్ వేగాన్ని అదుపు చేసే మందుల వాడకం.
- తగినంత ఖనిజాలు, ప్రోటీన్లు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
Osteoporosis – ఆస్టియోపోరోసిస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే మందులు:
- బిస్ఫాస్ఫోనేట్స్ ఈస్ట్రోజెన్, టెరిపారాటైడ్, రాలోక్సిఫెన్, మరియు కాల్సిటోనిన్
ఫిజియోథెరపీ నిర్వహణ:
ఆస్టియోపోరోసిస్ లో ఈ క్రింది ఫిజియోథెరపీ పద్దతులను ఉపయోగిస్తారు.
- అన్ని కీళ్ళు వద్ద యాక్టివ్ వ్యాయామాలు చేయించడం.
- బరువును మోసే వ్యాయామాలు.
- పగుళ్లు నివారించేందుకు ముందుజాగ్రత్తగా బ్రేసింగ్ పద్దతి ద్వారా వెన్నెముకను బలపరచడం.
- కండరాలను బలపరిచేటటువంటి అన్ని సాదారణ వ్యాయామాలు చేయించడం.
- సహన శక్తి (ఎండ్యురెన్స్) వ్యాయామాలు చేయించడం.
వాకింగ్ లేదా జంపింగ్ వంటి వ్యాయామాలు వృద్ధ ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి. బరువులు లేదా రేసిస్తేంట్ బ్యాండ్లు తో కూడుకొన్న వ్యాయామాలు చేయడం కండరాలు మరియు కీళ్ళు బలోపేతం కావడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా వయసు పైబడ్డ వారిలో. ఫ్లెక్సిబిలిటీ మరియు కండరాలను పటిష్టపరచే వ్యాయామాలు మొత్తం శారీరక ఫంక్షన్ మరియు భంగిమల నియంత్రణను మెరుగు పరచడానికి సహాయపడుతాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఆస్టియోపోరోసిస్ అనేది చాపక్రింద నీరులా, మనకు తెలియకుండానే తన పని తాను చేసేస్తూ తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకని వయసు మళ్ళిన వారు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. వంశపారంపర్యత ఉంటె, మెనోపాజ్ (ముట్లుడగటం) దశలో ఉన్న 40 నుండి 45 వయసు మధ్య మహిళలు, ఎముకల సాంద్రత అంచనా వేయడానికి పరీక్షలు చేయించడం అవసరం.
References:
- http://www.ncbi.nlm.nih.gov/pubmed/16455317
- International Osteoporosis Foundation Facts and Statistics
Reviews
It’s a good info regarding osteoporosis. Easy to understand for a lay man ..
Thanks, Mr.siva, glad you liked the post.
Thank you very much..
Good website keep it up