9 రుమటాయిడ్ ఆర్థరైటిస్ నియంత్రణ మార్గాలు


రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది శరీరపు వ్యాధి నిరోధక వ్యవస్థ తన కణజాలం మీద దాడి చేసే ఒక స్వయం వ్యాధినిరోధక డిజార్డర్. దీని వెనుక కారణాలు ఇప్పటికీ ఇంకా తెలియరాలేదు. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలగడానికి దోహదపడే ఇతర పరిస్తుతులు ఏమిటో అనేక అధ్యయనాలు విశ్లేషించాయి. జన్యు సంబంధిత మరియు పర్యావరణ కారకాల యొక్క మేళవింపు వల్ల శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ  నియంత్రణ కోల్పోయి దాని కణాలపై దాడి చేయడం మొదలవుతుంది. దురదృష్టవశాత్తు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా నయం చేయదగినటువంటి వ్యాధి కాదు. ఎవరైనా దీనిని నయం చేయవచ్చని చెబితే, అది వైద్య పరంగా అనైతికమే కాదు, రోగికి దీనిపై తప్పుడు అంచనాలు పెంచడం వంటిది.

కాని, శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ తన కణజాలం పై దాడి చేసే విధానాన్ని అర్ధం చేసుకోవడానికి కొన్ని అభివృద్ధి చెందిన వైద్య విధానాలు ఉన్నాయి. ఈ విధానాలు శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ యొక్క మితిమీరిన పనితీరును అదుపులో ఉంచడానికి ఉపయోగపడాతాయి. ఆహారపు అలవాట్లలో మరియు జీవనశైలిలో మార్పులద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు ఈ వ్యాధి లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు, లేదా ఇది తమ శరీర భాగాలపై అంత తొందరగా ప్రభావం చూపకుండా సమయాన్ని పొడిగించవచ్చు. ఇలా కొన్ని సంవత్సరాలైనా వ్యాధి తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.

9 నియంత్రణ మార్గాలు

డైట్ కంట్రోల్ (ఆహార పదార్థాలు నియంత్రణ)

కొన్ని ఆహార పదార్థాలు ఈ వ్యాధి తీవ్రత పెరగడానికి అగ్నికి ఆజ్యం తోడైనట్లు అవుతాయి. పలానా ఆహార పదార్ధం అని ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఒక్కొక్కరి శరీర విధానం బట్టి వారికి ఒక్కో ఆహార పదార్ధం పడకపోవచ్చు. కనుక ఈ వ్యాధి గల వారు తమకు ఏ ఆహారం తీసుకున్నపుడు వ్యాధి లక్షణాలు తీవ్రమవుతున్నాయో గమనించుకొని, ఆ ఆహారానికి వీలైనంత వరకు దూరంగా ఉండడం ఉత్తమం.

సాధారణంగా, మసాలా పదార్థాల ఆహారం మరియు వేపుడు వంటి ఆహారం, జీర్ణం అవడానికి కష్టం అయ్యే ఆహారం, తీపి పదార్థాలు, మరియు పానీయాలు, కేలరీలు అధికంగా గల ఆహారం వంటివాటికి దూరంగా ఉండాలి. ఒమేగా-3 సప్లిమెంట్లు,శోథ నిరోధక (యాంటి ఇంఫ్లమేటరీ) ఆహార పదార్థాలైన వెల్లుల్లి, అల్లం, పీచు పదార్ధం ఎక్కువగా ఉన్న, పండ్లు మరియు కూరగాయలు మరియు యాంటి ఆక్సిడెంట్లు వీరికి ఆమోదయోగ్యమైన ఆహారాలు. పసుపు వంటి సుగంధ ద్రవ్యాలు శరీరం భాగాలలో మంట, నొప్పి ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.

కాని, ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రోగికి ఉపయోగ పడిన విధానం మరొక రోగికి ఉపయోగపడకపోవచ్చు. కీలకమైన విషయం ఏంటంటే, సులభంగా జీర్ణం అయ్యే ఆహారం, మరియు మన శరీర జీర్ణ వ్యవస్థను సమతులంగా ఉంచే ఆహారం అయ్యుండి యాంటి ఇంఫ్లమేటరీ పదార్థాలై ఉండాలి. ఈ రోజుల్లో ఈ వ్యాధికి సూచించబడిన ఆహార పదార్థాల వివరాలు ఇంటర్నెట్ లో సులువుగా లభిస్తాయి.

శరీర బరువు అదుపులో ఉంచుకోవడం

అధిక బరువు గలవారిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి, లేదా ఉంటే ప్రభావం అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మయో క్లినిక్ వారు నిర్వహించిన అధ్యనం ప్రకారం, శరీర BMI 30 లేదా అంతకు మించి ఉన్న వారిలో, సాదారణ బరువు ఉన్న వారితో పోలిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అభివృద్ధి చెందడానికి 25% ఎక్కువ అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.[1] శరీరంలోని కొవ్వు కణాలు శరీరంలో వాపు రావడానికి కారణమవుతాయి. అధిక బరువు కారణంగా కీళ్ళ పై ఒత్తిడి పెరిగి రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీవ్రతను పెంచుతుంది. చాలా అధ్యనాలలో తేలిందేంటంటే శరీర బరువు తగ్గించుకోగలిగి సాదారణ బరువు కు దగ్గరలో ఉన్నవారిలో ఈ వ్యాధికి వాడే మందుల వల్ల ఎక్కువ ఉపయోగం కలుగుతుంది.

శరీర బరువు తగ్గడం అనేది చాల విషయాలపై ఆధారపడి ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాం.

జీవనశైలి

ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవడం అందరికీ అవసరం, కాని రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారికి ఇంకా చాల అవసరం. ఐతే ఆరోగ్యకరమైన జీవన విధానం అంటే ఏంటి? ఒకే రకమైన జీవనశైలి అందరికీ సరి కాకపోవచ్చు. కాని ఎవరికి వారు సరిచూసుకోవాల్సిన కొన్ని విషయాలు.

  1. కనీసం 7-8 గంటల నిద్ర పోవడానికి సమయం పొందగలుగుతున్నారా?
  2. కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, లేదా తేలికపాటి వ్యాయామం చేయగాలుగుతున్నారా?
  3. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏమైనా వ్యాపకం లేదా అభిరుచి కలిగి ఉన్నారా?
  4. మీరు తినే ఆహారం ఆరోగ్యవంతమైనది మరియు పోషకాహారమేనా?
  5. ధూమపానం, అధిక మధ్యపానం వంటి దురలవాట్లను వదిలిపెట్టారా?

మానసిక తోడు

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధి ఒక వ్యక్తిని శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా కృంగదీస్తుంది. కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల ఓదార్పు, తోడు మరియు ఈ వ్యాధి గురించి అవగాహన ఎంతైనా అవసరం.

ఈ వ్యాది ఉన్నవారు ఇంటర్నెట్ లోని ఫోరం లలో, తనలా ఈ వ్యాధి బారిన పడ్డ వారితో  పరస్పరం సంభాషించడం ద్వారా, ఈ వ్యాధి సోకినవారు పడే సమస్యలు మరియు దీనిని వారు ఎలా ఎదుర్కొంటున్నారు వంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా మానసిక ఆందోళనకు లోను కాకుండా ఉండగలరు ఇంకా విషయ అవగాహన కూడా కలగడం వల్ల తమ రోగ లక్షణాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. యోగ మరియు ధ్యానం వంటి వ్యాయామాలు సానుకూల దృక్పదం కలగడానికి మానసిక ఆందోళన తగ్గడానికి సహకరిస్తాయి.

అవగాహన

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధి గలవారు, ఈ వ్యాధి పట్ల పరిజ్ఞానం కలిగి మరియు నివారణ మార్గాల గురించి కుడా తెలిసి ఉండాలి. వ్యాధి అవగాహన కలిగి ఉండడం అన్నిటికంటే ప్రధానమైన, ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో ఈ వ్యాధి గురించిన చాల అవగాహనా మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు ఈ వ్యాధి కేవలం కీళ్ళపై మాత్రమే ప్రభావం చూపుతుందని తెలుసు, కాని ఇటీవల పరిశోధనలలో తెలిసిందేంటంటే, ఇది ప్రమాదకరమైన గుండె సంభందిత వ్యాదులతో కూడా ముడిపడి ఉందని. కనుక ఈ వ్యాధి గలవారు పూర్తి అవగాహన కలిగి ఉండడం సరైన సమయం లో వైద్యుని సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో వాడే మందులు, వాటి దుష్ప్రభావాలు అవగాహన కలిగి ఉండడం సరైన మందులు వాడడంలో, మరియు మోసపూరిత చికిత్సల బారిన పడకుండా ఉండడానికి తోడ్పడుతుంది.

గుర్తించడం ఎలా?

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక సంక్లిష్టమైన వ్యాధి. ల్యూపస్, ఫైబ్రోమైయాల్జియా వంటి వ్యాధులలో కనిపించే లక్షణాలే ఇందులో కూడా తొలిదశలో ఉంటాయి. చాలా సందర్భాలలో పలు పరీక్షలు చేసినప్పటికీ వ్యాధి నిర్ధారణ కష్టతరంగా ఉంటుంది.

రోగి ఈ వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి, తన ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ఉండవలసి ఉంటుంది, ముఖ్యంగా రెండు విషయాలలో. మొదటగా దీని ప్రభావం కీళ్ళ వద్ద గల రక్షణ పొర పై ఉంటుంది. ప్రధమంగా మెటికలు (వేళ్ల కణుపులు) పై ప్రభావం కనబడుతుంది. సి-రియాక్టివ్ ప్రోటీన్, ఎర్ర రక్తకణ రేటు (ESR), హిమోగ్లోబిన్ స్థాయి వంటి కొన్ని పరీక్షల ద్వారా విశ్లేషించవచ్చు.

తరచూ విస్మరించడానికి అవకాశం ఉన్న మరో విషయం, గుండె యొక్క ఆరోగ్యం. ఈ వ్యాధి వల్ల శరీరంలో ఉన్న వాపులు, కీల్లపైనే కాదు గుండె మీద కూడా ప్రభావం చూపించవచ్చు. స్ట్రోక్, గుండె రక్తనాళాలలో సమస్యలు, అంటే గుండె క్రమం తప్పి కొట్టుకోవడం. నాడి పరీక్ష, రక్తపోటు పరీక్ష, ECG వంటి పరీక్షలు ఉపయోగపడతాయి.

ఔషధ వినియోగం

రుమటాయిడ్ ఆర్థరైటిస్, పరిశోధనల మూలంగా వ్యాధి వివిధ దశల నిర్వహణలో అనేక మందులు అందుబాటులో ఉన్నాయి. NSAIDS, కార్టికోస్టెరాయిడ్, DMRD’s వంటి కొన్ని మందులు ఉపయోగపడతాయి. ఇవి ఒక్కో వ్యక్తి పై ఒక్కో విధంగా ప్రభావం చూపించవచ్చు. కనుక రోగి తనకు ఏ మందులు సరిపడతాయో వైద్యుని సలహామేరకు వాడవలసి ఉంటుంది. మందులు కానప్పటికీ హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజక్షన్ లు ఈ వ్యాధి కారణంగా కలిగే మోకాలు మరియు తుంటి నొప్పి నుండి ఉపశమనం కలిగినట్లు పరిగణించబడుతుంది.[2]

ఫిజియోథెరపీ

ఫిజియోథెరపీ ప్రధాన లక్ష్యం రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధివల్ల కలిగే వివిధ లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడటం. ఇందులో నొప్పి ఉపశమనం, కండరాల బలం, మరియు విశ్రాంతి కోసం చికిత్సలు ఉంటాయి. వేడి మరియు ఐస్ థెరపీ, హైడ్రో థెరపీ, అల్ట్రాసౌండ్ మరియు విద్యుత్ ప్రేరణ వంటి అనేక చికిత్సా విధానాలు ఉన్నాయి. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నపుడు రోగికి తగిన చికిత్సా విధానాలు ఎంపిక చేసుకోవడానికి ఫిజియోథెరపిస్ట్ చాలా ఉపయోగపడతాడు.[3]

శస్త్ర చికిత్సలు

నివారణ చర్యలు సరిగా తీసుకోక, వ్యాధి తీవ్రమైనప్పుడు, మరియు ఈ వ్యాధి వల్ల మోకాళ్ళ వంటి భాగాలకు అధిక నష్టం కలిగినపుడు, శస్త్రచికిత్స చివరి ప్రత్యమ్నాయ మజిలి గా భావించవచ్చు. సైనోవేక్టమి (కీళ్ళ పొరని తొలగించుట) అనబడే ఒక రకమైన శస్త్రచికిత్స కీళ్ళ మధ్య గల సైనోవియల్ పొరను తొలగించడం జరుగుతుంది.

వ్యాధి తీవ్రత ఇంకా ఎక్కువ ఉన్నపుడు, రోగికి వైకల్యం కలిగే సందర్భం ఉన్నపుడు, కీళ్ళ మార్పిడి వంటి శస్త్రచికిత్స చేస్తారు. ఈ వైద్యవిధానాలు చాలా అభివృద్ది చెందాయి. వీటివల్ల రోగి తిరిగి సహజ జీవన విధానం కొనసాగించవచ్చు.

Related

What happens to the heart in arthritis?

 

References

  1. Contribution of obesity to the rise in incidence of rheumatoid arthritis; Crowson, Cynthia S.; Matteson, Eric L.; Davis, John M.; Gabriel, Sherine E; Arthritis Care and Research, Volume 65 (1) – Jan 1, 2013
  2. http://www.ncbi.nlm.nih.gov/pubmed/18772121
  3. https://www.healthclues.net/rheumatoid-arthritis
  4. http://www.arthritis-health.com/glossary/synovectomy
Share this:

Related Post

Leave a Reply

2 thoughts on “9 రుమటాయిడ్ ఆర్థరైటిస్ నియంత్రణ మార్గాలు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి