వెన్ను నొప్పి నివారణ చర్యలు

జీవితం లో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో నడుము నొప్పితో బాధపడుతుంటారు. దానికి గల కారణాలు చాల ఉంటాయి. కారణం ఏదైనా అది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.

వెన్ను నొప్పి నివారణ గురించి కొన్ని వివరాలు

ఈ రోజుల్లో నడుమునొప్పి సమస్య లేని వారు చాల తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవనశైలి విధానమే. ఒకప్పుడు వయస్సు మళ్లిన వారిలోనే కనిపించే నడుమునొప్పి, నేటి ఆధునిక యుగంలో యుక్త వయస్కులను సైతం బాధిస్తుంది. ముఖ్యంగా 80% మంది ఎప్పుడో అప్పుడు దీని బారిన పడేవారే. కొన్ని ముందు జాగ్రత్తలతో ఇది రాకుండా మరియు తీవ్రతను తగ్గించుకోవటం గానీ చేయవచ్చు.

శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం (vertebral column) వెన్నెముక. ఇది 33 వెన్నుపూసలతో తయారవుతుంది, మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌లు సహాయపడతాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు  అరిగి పోవడం వల్ల, లేదా డిస్క్‌లు ప్రక్కకు తొలగి నరాలను కంప్రెస్ చేయడం వల్ల నడుము నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది.

కారణాలు

వెన్ను నొప్పి రావటానికి ప్రధాన కారణం వెన్నుపూసల మధ్యన ఉన్న కార్టిలేజ్‌ లో వచ్చేమార్పులు. కార్టిలేజ్‌ అనేది వెన్నుపూసలు సులువుగా కదలడానికి తోడ్పడుతుంది. కార్టిలేజ్‌ క్షీణించడం మరియు అరుగుదల వల్ల, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడి నొప్పి వస్తుంది. వెన్ను నొప్పికి ముఖ్య కారణం వెన్నెముక చివరి భాగం అరిగిపోవడమే.

ఇవే కాకుండా టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వెన్నుపూస అరిగిపోవడానికి దారి తీస్తాయి. దీంతో నడుము నొప్పి ఏర్పడుతుంది.

నడుము నొప్పికి మరి కొన్ని కారణాలు

 • స్త్రీలు ఇంటి లేదా వంట పనులు చేస్తున్నప్పుడు వస్తువులకోసం వంగి లేస్తున్నప్పుడు ఇది కలుగుతుంది.
 • దూది లేదా స్పాంజి ఎక్కువగా ఉపయాగించిన కుర్చీలలో అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం .
 • కూర్చొని పనిచేసే ఉద్యోగస్తులలో, కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కదలకుండా విధులు నిర్వర్తించటం వల్ల.
 • మనం తీసుకునే అహారంలో కాల్షియం, విటమిన్లు లోపించడం.
 • ఎవైన ప్రమాదాల వల్ల వెన్ను పూసలు దెబ్బ తినటం లేదా ప్రక్కకు తొలగటం వలన నడుము నొప్పి వస్తుంది.

లక్షణాలు

వెన్ను నొప్పి అదికంగా ఉన్నప్పుడు వంగడం, లేవడం, కూర్చోవడం, కష్టంగా మారుతుంది, కదలికల వలన నొప్పి తీవ్రత పెరుగుతుంది. నరాలు ఒత్తిడికి గురికావడం వలన, నొప్పి ఎడమకాలు లేదా కుడికాలుకు వ్యాపించి బాధిస్తుంది. హఠాత్తుగా నడుము వంచినా బరువులు ఎత్తినా నొప్పితీవ్రత భరించలేనంతగా ఉంటుంది.

జాగ్రత్తలు

 • వెన్ను నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 2 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
 • నడుము నొప్పి నియంత్రించడానికి ప్రతిరోజు వ్యాయామం, యోగా, డాక్టర్‌ సలహ మేరకు చేయాలి.
 • వాహనాలు నడిపేటప్పుడు మరియు ఎక్కువగా కూర్చొని పని చేసే ఉద్యోగస్తులు సరైన భంగిమల్లోనే కూర్చోవడం అలవాటు చేసుకోవాలి, ముఖ్యంగా స్పాంజి ఉన్న కుర్చీల్లో కూర్చున్నప్పుడు.
 • వెన్ను నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అధిక బరువులు ఎత్తడం, ఒకేసారి హటాత్తుగా వంగటం చేయకూడదు.
 • వెన్ను నొప్పి అధికంగా ఉన్నప్పుడు నడుము భాగం మీద వేడినీటి కాపడం, ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం చేయాలి. అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద అల్ట్రాసౌండ్‌ చికిత్స వంటివి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
 • స్థూలకాయం (obesity) వల్ల వెన్నెముక మీద అదనపు భారం పడుతుంది. కాబట్టి,  శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
 • వ్యాయామం, శారీరక శ్రమ అలవాటు లేనివాళ్లు బరువులు ఎత్తితే కూడా నడుము నొప్పి వస్తుంది. ఇలాంటి వారిలో ఒక్కసారిగా బరువులు ఎత్తితే కండరాలు, ఎముకలపై ఒత్తిడి పెరిగి తీవ్ర నొప్పి కలుగుతుంది. కూర్చునేటప్పుడు మోకాళ్ల మీదే ఎక్కువ భారం పడేలా కూర్చుని లేవాలి, వంగి లేవకూడదు.
 • పిల్లల స్కూలు బ్యాగుల బరువు పిల్లాడి బరువులో 10% మించకూడదు. మరియు ఈ బ్యాగులకు పట్టీలు ఉండాలి, బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి.
 • హీల్స్ సైజు ఎక్కువగా ఉండే సాన్డిల్స్ ధరించకూడదు.
 • అధిక పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. శరీర బరువును తగ్గించుకోవాలి.

 వెన్ను నొప్పికి తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు

 • కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
 • ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.
 • శరీర బరువు ఎక్కువ ఉంటే వెంటనే తగ్గించుకోండి.
 • ప్రతిరోజు 8 నుండి 10 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సి వస్తే బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
వెన్ను నొప్పి నివారణ చర్యలు Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

2 thoughts on “వెన్ను నొప్పి నివారణ చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *