Knee Replacement Surgery

మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery)

ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు మనిషికి ఏమి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యము సరిగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఈ సూత్రము మనిషికే కాదు ప్రపంచములో ఉన్న ప్రతి జీవి మనుగడకు ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎలాంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా మరియు ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము. ఈ వ్యాసంలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!

ప్రస్తుతం వయసు పైబడిన వారిలో ముఖ్యంగా వేధించే సమస్య మోకాలి నొప్పి. దీనివల్ల కనీసం 10 అడుగులు వేయటం కూడా కష్టమైపోతుంది. 4 మెట్లు కూడా ఎక్కలేకపోతుంటారు. కొందరు రోజువారీ సాధారణ పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. నొప్పి తీవ్రత వల్ల కింద కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో 15% మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు . అయితే వీరిలో దాదాపు 14% మందికి మందులతోనే ఉపశమనం కలుగుతుంది. 1% మందికి కీళ్ళ మార్పిడి చికిత్స తప్ప మరోమార్గము లేదు. ఇటువంటి వారికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఒక వరంలాంటిదంటున్నారు చాలా మంది ఆర్థోపెడిక్ సర్జన్లు. కాని శస్త్రచికిత్సకు ముందు రెండవ అభిప్రాయం (second opinion) ఖచ్చితంగా తీసుకోవాలి. మోకాలి నొప్పితో బాధపడే వారు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకుని హాయిగా జీవితాన్ని గడపవచ్చు.

మారుతున్న జీవన శైలి విధానం, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయి. 60 యేళ్లకి వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు 45 ఏళ్ళలోనే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో మోకాళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటోంది. ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గడం, శరీరంలో కాల్షియం లోపించడం, మరియు వ్యాయామం చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ముఖ్యంగా స్త్రీలలో రుతుస్రావం (menopause) ఆగిపోయిన తరువాత శరీరంలో కాల్షియం లోపం ఇంకా ఎక్కువవుతుంది. కాల్షియం అధికంగా ఉండే ఆహారపదార్దాలు పాలు, ఆకుకూరలు తగినంత తీసుకోకపోవడం వల్ల శరీరంలో కాల్షియం మోతాదు తగ్గిపోతుంది. మోకాలి నొప్పికి మరొక ప్రధానకారణం స్థూలకాయం (obesity).  స్థూలకాయం వల్ల మోకాలు కీళ్లఫై అధిక బరువు పడడం వల్ల అరుగుదల ఎక్కువగా జరిగి నొప్పి ప్రారంభమవుతుంది. ప్రాథమిక దశలో మోకాలి నొప్పిని గుర్తించి చికిత్స తీసుకుంటే మందులతోనే తగ్గుతుంది. ఆలస్యం చేస్తే కీళ్ల మధ్య అరుగుదల ఎక్కువయి సమస్య మరింత పెరుగుతుంది. ప్రస్తుతం మోకాళ్ళ నొప్పులకు మరియు ఆర్థరైటిస్ కి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు గ్లూకోజమైన్ లాంటి మందులు వాడటం ద్వారా చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటు కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం, అధిక బరువు తగ్గించుకోవడం, వల్ల మోకాలి నొప్పిని తగ్గించుకోవచ్చు.

ఎవరికి మోకాళ్ళ మార్పిడి అవసరం?

  • గత కొద్ది సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారికి.
  • 10 నిముషాలకంటే ఎక్కువ సమయము నిలబడలేకపోతున్నవారికి.
  • 5-6 మెట్లు కూడా ఎక్కలేనివారికి
  • కేవలం 500 అడుగులు కూడా నడవలేని వారికి
  • రోజు వారి పనులు చేసుకోలేకపోతున్న వారికి
  • నొప్పి నివారణ మాత్రలు మరియు ఇతర చికిత్సలు పనిచేయనపుడు
  • మోకాలు మధ్యలో ఉండే గుజ్జు (cartilage) పూర్తిగా అరిగిపోయి తీవ్రమైన నొప్పలతో బాధపడుతున్న వారికి
  • కాళ్లు వంగిపోయిన వారికి కృత్రిమ కీలు అమర్చడం చక్కని పరిష్కారం

ఎలా సరైన మోకాలి ఇంప్లాంట్ ఎంచుకోవాలి?

సైన్స్ ఇటీవల శతాబ్దంలో పరిణతి చెందింది. చాలా పరిశోధనల అనంతరం వివిధ రకాల కృత్రిమ మోకాళ్లు(knee implants) మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రోగి బరువు, జివనశశైలిని బట్టి, ఆరోగ్య స్థితిని పరిశీలించి ఏ రకమైనది సరిపోతుందో వైద్యులు నిర్ధారిస్తారు. మోకాలు మార్పిడి (knee replacement) ఆపరేషన్ చేయించుకున్న 10 నుంచి 15 శాతం మందిలో లోహ సంబంధమైన అలర్జీలు మరియు ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ అలర్జీలను రాకుండా నివారించే అధునాతమైన కృత్రిమ సిరామిక్ మోకాళ్లు (ceramic implants) ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది:

కోబాల్ట్ – క్రోమియం ఇంప్లాంట్లు:

కోబాల్ట్ – క్రోమియం మిశ్రమాలు చాల కఠినమైన మరియు తుప్పు నిరోధకత, జీవాణుగుణంగా ఉండే ఖనిజాలు. టైటానియంతో పాటు, కోబాల్ట్ క్రోమ్ మోకాలి ఇంప్లాంట్లు అత్యంత విస్తృతంగా ఉపయోగించే లోహాలలో ఒకటి. మోకాలి శస్త్రచికిత్స రోగులలో కోబాల్ట్ క్రోమియం మిశ్రమాలకు సంబంధించిన అలెర్జీలు కలగడం చాలా తక్కువగా ఉంటుంది. అయితే, చిన్న ఆందోళనకరమైన విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో మెటల్ కణాలు (లోహ అయాన్ల)  శరీరంలోకి విడుదల కావచ్చు ఫలితంగా ఈ అణువులు కొన్నిసార్లు ముఖ్యంగా నికెల్ వంటి ప్రత్యేక లోహాలతొ వచ్చే అలెర్జీ కలగవచ్చు. కోబాల్ట్ – క్రోమియం ఇంప్లాంట్లు జీవితకాలం 10-15 సంవత్సరాల వరకు ఉంటుంది.

ఒక్ష్సినియమ్-జిర్కోనియమ్ ఇంప్లాంట్లు:

జిర్కోనియం ఇంప్లాoట్లు ఆధునిక సిరామిక్ మిశ్రమంతో తయారవుతాయి.  ఈ నూతన మోకాలి కింది భాగం ఇంప్లాoట్లు సిరామిక్ మరియు పాలిథిలిన్ వంటి పదార్ధాలతో తాయారు చేస్తారు. ఇవి చాలా దృడంగా పనిచేస్తాయి. వీటి జీవితకాలo 20-25 సంవత్సరాల కంటే చాల ఎక్కువగా ఉంటుంది. ఈ  ఇంప్లాoట్లు యొక్క మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఇవి నికెల్ అలెర్జీలు రాకుండా పనిచేస్తాయి.

ఆపరేషన్ సమయంలో ఎలా అమర్చుతారు?

తొడ ఎముక (femur) కింది భాగం, కాలు పైభాగం (tibia) మధ్యలో ఉండే జిగురు (కార్టిలేజ్) అరిగిపోవడం వల్ల మోకాళ్ళ మధ్య రాపిడి ఎక్కువై నొప్పి మొదలవుతుంది. ఈ శస్త్రచికిత్స లో భాగంగా ఆరిగిన ఎముక స్థానంలో కృత్రిమ మెటల్‌ను అమర్చడం జరుగుతుంది. మరియు కృత్రిమ మెటల్ ను అమర్చిన తర్వాత అరిగిన జిగురు (కార్టిలేజ్) స్థానంలో రెండు వైపులా మెనిస్కై (menisci) ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చూడటానికి ప్లాస్టిక్ కప్ లాగా ఉంటుంది. సాధారణంగా ఈ మెటల్ ఇంప్లాoట్లు తక్కువ అరుగుదలతో ఎక్కువ కాలం మన్నడమే కాకుండా, పటుత్వం కలిగి ఉండటాయి, మరియు ఈ మెటల్స్ తో తయారయ్యే మోకాళ్ళలో సిరామిక్ పదార్దాలు ఎలాంటి అలర్జీలు రాకుండా నివారిస్తాయి. మోకాలు నొప్పులతో బాధపడేవారికి ఇవి బంగారు మోకాలేనని చెప్పొచ్చు. సర్జరీ తరువాత నొప్పి పూర్తిగా తగ్గిపోయి మామూలుగా నడవటం, రోజు వారి పనులు చేసుకోవడం సులభమవుతుంది. మోకాలు మార్పిడి తరువాత కూడా నొప్పి తగ్గదనేది అపోహ మాత్రమే. ఒకసారి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారు 15 సంవత్సరాల పాటు నడవటం, మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం లాంటి పనులు చేసుకోవచ్చు.

శస్త్రచికిత్స తరువాత!

మోకాలు మార్పిడి శస్త్రచికిత్స (knee replacement) అనంతరం నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. మరియు తిరిగి మీరు రోజువారి పనులు సులువుగా చేసుకోగలుగుతారు. కృత్రిమ కాలు ఎంతకాలం మన్నుతుంది అనే విషయం వారి జీవనవిధానం, అలవాట్లు, శస్త్రచికిత్సలో అమర్చిన మెకాలుపై ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం చేయవచ్చు మరియు ఎంత దూరమైన నడవచ్చు, ఎన్ని మెట్లయినా ఎక్కవచ్చు. కానీ కింద కూర్చునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మోకాలు మార్పిడి అనంతరం 20-30 ఏళ్ల పాటు హాయిగా జీవించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *