back-pain-treatment-options-telugu

నడుం నొప్పి – చికిత్సా పద్ధతులు

నడుం నొప్పి చాలా సర్వసాధారణం. ఈ సమస్య యుక్తవయస్కుల వారి నుండి వయసు పై బడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. కాని ఇప్పుడు వయసుకు మించిన బరువు (స్కూలు బ్యాగు, పుస్తకాలు) మోయడం వలన స్కూలుకు వెళ్ళే చిన్నారులు కూడా ఈ నొప్పితో బాధపడుతున్నారు. నడుం నొప్పికి కారణమైన వెన్నుముక మన శరీరంలో చాలా విశిష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, జాయింట్లు అనుసంధానమై శరీరానికి స్థిరత్వాన్నిస్తూ మన రోజువారి పనులలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో ఒత్తిడిలను తట్టుకుని నరాల మీద ఏ విధమైన ఒత్తిడి పడకుండా కాపాడటం వెన్నుముక ప్రధాన లక్షణం. దెబ్బలు తగలడం, అతిగా బరువులు ఎత్తడం, స్థూలకాయం, ఇన్‌ఫెక్షన్లు, క్యాల్షియం మరియు విటమిన్‌ B12, D లోపాలు, ఎముకల సాంద్రత తగ్గటం నడుం నొప్పికి ప్రధాన కారణాలు. కొందరు నడుం నొప్పి భరించలేక తమ ఉద్యోగాలను కూడా మార్చుకుంటున్నారు. చాలా వరకు నడుము నొప్పి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోయిన తగ్గిపోతుంటుంది. కానీ దీర్ఘకాలిక లేదా తీవ్రమైన నడుము నొప్పి ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ ను  సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవటం ఉత్తమం.

ఈ ఆర్టికల్లో నడుం నొప్పి రావడానికి ముఖ్య కారణాలు మరియు నొప్పి నివారణకు ఎలాంటి చికత్స అవసరమో తెలుసుకుందాం.

నడుము నొప్పి రావడానికి కారణాలు:

 • ఎక్కువగా ఒకే పొజీషన్‌లో కూర్చోవటం
 • బరువు ఎక్కువగా ఉండడం
 • ఎక్కువ దూరం కార్లలో లేదా ద్విచక్ర వాహనాలపై ప్రయానిoచడం
 • వెన్నెముకకు దెబ్బ తగలడం
 • ఫిజికల్‌గాఫిట్‌గా లేకపోవడం
 • వెన్నుపూస క్షయకు గురికావడం వల్ల (టి.బి స్పైన్)
 • వెన్నెముకకు కణుతులు (స్పైన్ ట్యూమర్స్)
 • క్యాన్సర్‌ సోకటం వల్ల
 • గర్భధారణ సమయంలో కూడా స్త్రీలలో నడుం నొప్పి ఉండవచ్చు
 • డిస్క్‌ అరగడం–ముఖ్యంగా ఇది వయసు పైబడిన వాళ్ళలో వస్తుంది. దీనినే డిస్క్‌ డీజనరేటివ్‌ డిసీజ్‌ అంటారు.
 • శారీరకంగా, మానసికంగాఒత్తిడి
 • పొగతాగడం

హెర్నియేటెడ్‌ డిస్క్‌ (Herniated disc)

బలహీనపడిన డిస్క్‌ అంచు చిరిగి దాని మధ్య భాగంలో ఉండే మెత్తని మృదులాస్థి బయటకు తోసుకుని రావడాన్ని హెర్నియేషన్‌ అని అంటారు. దీనినే ‘డిస్క్‌ ప్రొలాప్స్‌’  అనికూడా అంటారు. మెత్తని మృదులాస్థి బయటికి వచ్చి వెన్ను నుండి మోకాల్లలోకి ప్రయాణించే నరాలపై ఒత్తిడిని కలగజేయడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. కొన్ని సార్లు ఈ ఒత్తిడి వల్ల రోగి తొంటి మరియు మోకాళ్ళలో స్పర్శ కోల్పోవడం జరుగుతుంది.

స్పాండిలోలిస్థిసిస్‌ (spondylolisthesis)

వెన్నులోకి ఎముకలు పరిమితికి మించి ముందుకు కానీ వెనకకు కానీ జారడాన్ని స్పాండిలోలిస్థిసిస్‌ అంటారు. ఇది ముఖ్యంగా వెన్నులోని ఎముకలను పట్టి ఉంచే లిగ్‌మెంట్లు సాగటం, వెన్నుపూసలో ఒక భాగం విరగడం వల్ల వస్తుంది. స్పాండిలోలిస్థిసిస్‌ తీవ్రంగా ఉంటే వెన్నుపూస ఎముకల మధ్యలో ఉండే డిస్క్ నరాలపై ఒత్తిడి పెంచి తీవ్రమైన నడుము నొప్పికి దారి తీస్తుంది.

ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌ (Ankylosing spondylitis)

ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌. ఈ వ్యాది వెన్నుపూస దీర్ఘకాలిక వాపుకి గురి కావడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా వెన్నుపూసను, తుంటి కీలు పై ప్రభావితం చూపుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారి వెన్నుపూసలోని ఎముకలు బిగుసుకుపోయి నడుము కదలికలు కష్టతరం అవుతాయి. దీనినే ‘బాంబూ స్పైన్‌’ అంటారు.

స్పైనల్‌ స్టినోసిస్‌ (spinal stenosis)

వెన్నులోపల ఉండే స్పైనల్‌ కెనాల్‌ అనే నాళం మూసుకుపోవట౦ లేదా ఇరుకుగా మారటాన్ని స్పైనల్‌ స్టినోసిస్‌ అంటారు. ఇది తీవ్రంగా ఉంటే నాళంలో ఉండే వెన్నుపాము (స్పైనల్ కార్డ్) ఒత్తిడికి గురై తీవ్రమైన నడుo నొప్పి, తిమ్మిర్లు రావడం, కాళ్లు బలహీన పడటం, మలమూత్రాలు విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

లక్షణాలు

 • సాధారణం నుండి తీవ్రమైన నడుము నొప్పి
 • నడుము పట్టేయడం
 • వెన్నులోని ఎముకలతో పాటు నరాలు కూడా వ్యాధి బారిన పడితే నొప్పి నడుములో ప్రారంభమై పిరుదుల్లోకి, అక్కడి నుండి తొడల్లోకి, కాళ్లు, పాదాల వరకూ వ్యాపిస్తుంది
 • కాళ్లల్లో తిమ్మిర్లు
 • పాదాలలో మంటలు రావడం

నిర్ధారణ (డయాగ్నొస్టిక్ టెస్టులు)

సి.బి.పి, ఆర్‌ఎ ఫ్యాక్టర్‌, ఎక్స్-రే, CT స్కాన్‌, MRI వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఇంకా నడుము నొప్పికి కారణమయ్యే ఇతర తీవ్రమైన వ్యాధులను గుర్తించవచ్చు.

నడుం నొప్పికి చికిత్సలు

నడుం నొప్పి కొన్ని సందర్భాలలో ఎటువంటి చికిత్స లేకుండానే తగ్గిపోతుంది. అందువల్ల డాక్టర్లు ముందుగ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ల (టాబ్లెట్లు, ఫిజియోథెరపి) ద్వారా నడుం నొప్పిని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ డాక్టర్ ను సంప్రదించినపుడు అతడు మీ రోజువారీ పనులు తగ్గించుకోవడంతో పాటు విశ్రాంతి తీసుకోమని సూచిస్తాడు. మీ నడుము నొప్పి కొద్దిగ తగ్గిన తర్వాత మీరు మీ యొక్క రోజువారి పనులను చేసుకోవడం మొదలుపెట్టవచ్చు. నడుం నొప్పి తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని నాన్ సర్జికల్ చికిత్సపద్దతులు:

మందులు:

సాధారణంగా నడుం నొప్పి చికిత్సకు ఉపయోగించే మందులు:

 • ఎసిటమైనోఫెన్, మరియు స్టెరాయిడ్ ఇన్ఫ్లమేటరీ మందులు
 • మసల్ రిలగ్సంట్స్
 • కార్టికోస్టెరాయిడ్స్
 • యాంటిడిప్రేసన్ట్స్ వంటివి నొప్పి నివారణకు వాడతారు
 • స్పైనల్ ఇంజెక్షన్: టాబ్లెట్లతో నొప్పి తగ్గనపుడు వెన్నెముకకి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాళ్ళలో నొప్పి తీవ్రంగా మరియు కాళ్ళలో బలహీనత ఉన్నప్పుడు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

ఫిజియోథెరపీ:

ఫిజియోథెరపీ అనేది నొప్పిని తగ్గించడానికి ఉత్తమoగా పనిచేస్తుంది. ఇది నొప్పి, ఇతర లక్షణాలను తగ్గిస్తుంది మరియు వెన్నుపూస కండరాలను బలపరస్తుంది. ఫిజియోథెరపిస్ట్ మీకు వెన్నును బలపరిచే కొన్ని వ్యాయామాలను నేర్పిస్తాడు. ఈ వ్యాయామాలు నడుము నొప్పి ఉన్నా లేకపోయినా చేసుకోవటం వల్ల వెన్నుపూస దృఢంగా ఉంటుంది.

హీట్ లేదా కోల్డ్ థెరపీ:

మొదటి 24-48 గంటల్లో హీట్ లేదా కోల్డ్ థెరపీలు నడుం నొప్పి తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి కండరాల వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి. హీట్ లేదా కోల్డ్ చికిత్స చేస్తున్నప్పుడు, చర్మానికి చల్లని లేదా వేడిని నేరుగా తగలకుండా జాగ్రత్తపడాలి. వీలైతే వాటిని (హాట్ పాక్స్ లేదా కోల్డ్ పాక్స్) ఏదైనా ఒక కాటన్ వస్త్రంలో ఉంచి నొప్పి ఉన్న చోట ఉపయోగించండి.

శస్త్ర చికిత్స:

కొన్ని సమయాల్లో కింది లక్షణాలు కల రోగులకు సర్జరీ అవసరం కావచ్చు:

 • దీర్ఘకాలిక హెర్నియేటేడ్ డిస్క్ తో బాధపుతున్న వారికి
 • స్పాండైలోలిస్థేసిస్: వెన్నులోకి ఎముకలు పరిమితికి మించి ముందుకు కానీ వెనకకు కానీ జారిపోయి ఉంటే
 • పార్శ్వగూని (స్కోలియోసిస్)
 • స్పైనల్‌ స్టినోసిస్‌: వెన్నులోపల ఉండే స్పైనల్‌ కెనాల్‌ అనే నాళం మూసుకుపోవట౦ లేదా ఇరుకుగా మారి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు
 • వెన్నుపూస ఫ్రాక్చర్స్ ఉన్నపుడు

నడుం నొప్పికి శస్త్ర చికిత్స చేయడమనేది చిట్టచివరి ఎంపికగా ఉంటుంది. అన్నిరకాల నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లు (టాబ్లెట్స్,  ఫిజియోథెరపీ) వాడి చూసాక, ఆత్యవసర స్థితిలో మాత్రమే సర్జరీని సిఫారసు చేస్తారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జనరల్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వార రోగికి 6 వారాలలో ఉపశమనం కలగకుంటే శస్త్రచికిత్సను ఎంచుకోవచ్చు.

అనేక కారణాల వలన కలిగే నడుం నొప్పిని తగ్గించడానికి చేసే సర్జరీలు వివిధ రకాలుగా ఉంటాయి. ఈ శస్త్ర చికిత్సలను ఈ విధంగా వర్గీకరించవచ్చు.

 • నరాల పై ఒత్తిడిని తగ్గించేవి: ఈ ప్రక్రియలో నరాలపై ఒత్తిడి కలిగిస్తున్న ఎముకలను లేదా డిస్క్ లను సరిచేయడానికి.
 • శరీర ఖండితాలను కలిపేవి: ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముక భాగాలను, లోహాన్ని ఉపయోగించి ఒకటిగా అతికించే ప్రక్రియ.
 • విరూపాలను సరిచేసేవి: పుట్టుకతో వచ్చే విరూపాలను, యాక్సిడెంట్ లో గాయాల పాలయిన ఎముకలను సరిచేయడానికి.

శస్త్రచికిత్స అనేది నడుం నొప్పి యొక్క అనేక లక్షణాలను, కారణాలను తగ్గించడానికి ఉపయోగించే చివరి ప్రత్యామ్నాయ పరిష్కారం. శస్త్రచికిత్స అనగానే భయపడాల్సిన అవసరం లేదు. నేడు నడుం నొప్పి తగ్గించే శస్త్రచికిత్సలలో చాలా మార్పులొచ్చాయి.

చిన్న గాటుతో శస్త్ర చికిత్స చేసే విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ రకమైన విధానాలు సంప్రదాయ శస్త్ర చికిత్స కన్నా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి కచ్చితంగా వ్యాధిని నిర్మూలించడమే కాకుండా, వీటిలో పట్టే సమయం తక్కువగా కూడా ఉంటుంది. రోగి శస్త్రచికిత్స అవగానే ఒకటి-రెండు రోజుల్లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి త్వరగా కోలుకోవచ్చు.

నడుము నొప్పి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

 • నడుం నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 2 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
 • నడుము నొప్పిని నియంత్రించడానికి ప్రతిరోజు వ్యాయామం, యోగా, డాక్టర్‌ సలహ మేరకు చేయoడి.
 • వాహనాలు నడిపేటప్పుడు మరియు ఎక్కువగా కూర్చొని పని చేసే ఉద్యోగస్తులు సరైన భంగిమల్లోనే కూర్చో వడం అలవాటు చేసుకోవాలి, ముఖ్యంగా స్పాంజి ఉన్న కుర్చీల్లో కూర్చున్నప్పుడు.
 • నడుం నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అధిక బరువులు ఎత్తడం, ఒకేసారి హటాత్తుగా వంగటం చేయకూడదు.
 • నడుం నొప్పి అధికంగా ఉన్నప్పుడు నడుము భాగం మీద వేడి నీటితో కాపడం, ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం చేయాలి.
 • స్థూలకాయం (ఒబేసిటీ) వల్ల వెన్నెముక మీద అదనపు భారం పడుతుంది. కాబట్టి,  శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
 • వ్యాయామం, శారీరక శ్రమ అలవాటు లేనివాళ్లు బరువులు ఎత్తితే కూడా నడుము నొప్పి వస్తుంది. ఇలాంటి వారిలో ఒక్కసారిగా బరువులు ఎత్తితే కండరాలు, ఎముకలపై ఒత్తిడి పెరిగి తీవ్ర నొప్పి కలుగుతుంది.
 • కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
 • ఒకే పొజిషన్‌లో 30 నిముషాలు లేదా ఒక గంట కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.

back pain in telugu, back pain causes in telugu, back pain symptoms in telugu, back pain treatment options in telugu, Disc prolapse in telugu, Slip disc and back pain in telugu, Herniated disc in telugu, spondylolisthesis in telugu, spinal stenosis in telugu, Ankylosing spondylitis in telugu, back pain prevention in telugu.

Have a question?

Feel free to ask us for any help or information here!

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
నడుం నొప్పి – చికిత్సా పద్ధతులు Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *